
నూతన మీడియా కమిషన్ రక్షణ చట్టం తెవాలి
నూతన మీడియా కమిషన్ రక్షణ చట్టం తెవాలి
-టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లవర్జుల వంశీ విద్యానంద్,నారాయణదాసు అశోక్
-జర్నలిస్టులకు ఉచిత వైద్యం,ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన.. వినతి పత్రాల అందజేత

పెద్దపల్లి,అక్టోబర్ 02 (ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ -ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు,మహాత్మా గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పాత్రికేయుల డిమాండ్ల దినం కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాజంలో నిరంతరం వార్తల సేకరణ కోసం కష్టపడే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని,వారి హక్కులను సమర్థవంతంగా పరిరక్షించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా కేంద్రంలోని గాంధీజీ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి,నివాళులర్పించారు.అనంతరం సమాజం కోసం ప్రాణాలు అర్పించిన అమర జర్నలిస్టుల స్మారకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు.జర్నలిస్టుల హక్కులు మరియు భద్రతను తక్షణమే కాపాడాలంటూ పాత్రికేయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని సంబంధిత అధికారులకు తమ డిమాండ్లతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే-ఐజేయూ
జిల్లా అధ్యక్షులు మల్లవర్జుల వంశీ విద్యానంద్,జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమైన పత్రికారంగం, మీడియా సిబ్బంది రక్షణ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగి రక్షణ చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా నూతన సమగ్ర మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై పెరుగుతున్న భౌతిక దాడులను సమర్థవంతంగా అరికట్టేందుకు పటిష్టమైన ప్రత్యేక కేంద్ర రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కోరారు.కొత్తగా అమల్లోకి తెచ్చిన కార్మిక కోడ్ల వల్ల నష్టపోయిన 1955, 1958 నాటి చట్టబద్ధ రక్షణలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.దాదాపు రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన వేతన సవరణలను దృష్టిలో ఉంచుకుని,ప్రింట్, ఎలక్ట్రానిక్,డిజిటల్ రంగాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల మీడియా ఉద్యోగులకు వర్తించేలా నూతన వేతన మండలిని తక్షణమే ఏర్పాటు చేయాల డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ళు,ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రింట్,ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియా జర్నలిస్టులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామీణ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే పాత్రికేయులందరికీ ఆర్టీసీ బస్సులలో పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరారు.జర్నలిస్టుల సుదీర్ఘకాల డిమాండ్లను వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని,లేనిపక్షంలో భవిష్యత్తులో జిల్లావ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో పెద్ద ఎత్తున పోరాటాలు,ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ కు చెందిన ప్రింట్,ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియాకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు, నియోజకవర్గ,మండల స్థాయి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

