మెట్పల్లిలో బంగారు ఆభరణాల చోరీ కేసు ఛేదన
మెట్పల్లిలో బంగారు ఆభరణాల చోరీ కేసు ఛేదన
స్నేహితుడి ఇంట్లోనే చోరీ..
రూ.లక్షల విలువైన బంగారం స్వాధీనం
మెట్పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 6( ప్రజా కలం ): మెట్పల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలి కుమారుడి స్నేహితుడే చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం… రెడ్డి కాలనీకి చెందిన తలారి లావణ్య @ ప్రేమలత తన ఇంటి బీరువాలోని లాకర్లో సుమారు 4.5 తులాల బంగారు గొలుసు, 2 తులాల నెక్లెస్, అర తులం బంగారు కమ్మలు, బుట్టలు, అర తులం ఉంగరం, అర తులం మాటీలు ఉంచారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 14న గుర్తు తెలియని వ్యక్తులు వీటిని చోరీ చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తులో భాగంగా లావణ్య తన కుమారుడు అభినవ్ స్నేహితుడైన చైతన్యనగర్‌కు చెందిన ఇందూరి నవీన్ (26)పై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు నవీన్‌ను నవంబర్ 6న ఉదయం అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నవీన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడని, తన సంపాదన సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. తరచూ అభినవ్ ఇంటికి వెళ్లే క్రమంలో లావణ్య బంగారు ఆభరణాలను బీరువాలో ఉంచడం, బీరువాకు తాళం లేకపోవడాన్ని గమనించిన నవీన్ చోరీకి పథకం వేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 3న అభినవ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బీరువాలోని బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లినట్లు నవీన్ విచారణలో వెల్లడించినట్లు వివరించారు.అనంతరం మెట్‌పల్లిలోని మణప్పురం గోల్డ్ లోన్స్‌లో ఒకేసారి బంగారం తాకట్టు పెడితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మూడు విడతల్లో కొంతకొంతగా బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు చెప్పారు. ఆ డబ్బులో కొంత అప్పులు తీర్చగా, మిగతా మొత్తాన్ని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడి నుంచి బంగారం తాకట్టు పెట్టేందుకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌తో పాటు మణప్పురం గోల్డ్ లోన్స్‌కు సంబంధించిన రసీదులు, స్టేట్మెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం మెట్పల్లి జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు మెట్పల్లి ఎస్సై పి. కిరణ్‌కుమార్ తెలిపారు.
వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్
వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి సంపాదించిన డబ్బుతో కుటుంబంతో సంతోషంగా జీవించాలని ఆయన అన్నారు. నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

