
శిలాఫలకంపై దుండగుల దాష్టీకం
శిలాఫలకంపై దుండగుల దాష్టీకం
-దుండగులపై చర్యలకు గ్రామస్తుల డిమాండ్
-బాధ్యులను వదిలేది లేదు: ఏఈ నాగరాజు
పెద్దపల్లి,నవంబర్ 10:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామంలో ఎస్సీ సబ్-ప్లాన్ నిధులతో మంజూరైన సి.సి.రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది.గ్రామంలో స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ రోడ్డు అభివృద్ధి పనుల అధికారిక శిలాఫలకాన్ని కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగానే నేలమట్టం చేశారు.ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు,ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లతో కూడిన శిలాఫలకాన్ని ఇలా ధ్వంసం చేయడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ సమాజంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్న ఇలాంటి వ్యక్తులపై సంబంధిత అధికారులు,పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి,బాధ్యులను తక్షణమే గుర్తించి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు
ఈ ఘటనపై పంచాయతీరాజ్ ఏఈ నాగరాజును వివరణ కోరగా..శిలాఫలకం ధ్వంసం చేసిన విషయంపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన బాధ్యులను గుర్తించి,వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

